విశ్వం గురించి కొన్ని నిజాలు - అపోహలు The Universe
విశ్వం గురించిన అపోహలు
===============
ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందక ముందు కొన్ని అపోహలు ఉండేవి. అవి ఇపుడు తొలగి పోయాయి. కానీ ఇంకా కొందరు ఆజ్ఞానం తోనో లేక అహం తోనో లేక ఆ అజ్ఞానం చెప్పిన వారు మన మున్ముత్తాతవ్వలు అనే మోహం తోనో ఆ అపోహలను తొలగించుకోలేక పోతున్నారు. వాటిలో కొన్నిటిని,వాటికి విరుగుడులను, క్రింద ఇస్తున్నాను.
1. విశ్వం ముందు లేదని, ఎవరో వచ్చి దానిని సృష్టించారని కొందరు ఊహించారు.
అది వైజ్ఞానిక పరిశీలన లో తప్పు అని తేలిపోయింది. విశ్వం లో ఏది కూడా సృష్టి కాదు, ఏదయినా సరే, ఉన్నదాని యొక్క పరిణామమే. విశ్వం స్వతఃసిద్ధం, స్వయంచలితం. దీనిని ఎవరూ పుట్టించ నవసరం లేదు. ఎవరూ నాశం చేయ శక్యులు కాదు. విశ్వం లో జరిగే ప్రతి సంఘటనకు, ముందు ఉంది, వెనుకా ఉంది. ముందు వెనుక లేని సంఘటన ఏది లేదు. ఏ సంఘటన జరిగినా ఉన్న దానితోనే జరుగుతోంది. ఉన్నదాని నుంచే సంఘటన జరుగుతుంది, దాని నుంచి ఉన్నదే వస్తున్నది. లేని దాని నుంచి ఏది రావటం కానీ, ఉన్నది ఉరువు లేకుండా పోవడం కానీ జరగదు. కనుక సృష్టి అనేది అబద్దం.
2. విశ్వాన్ని పుట్టించక పోయినా, ఎవరో ఏదో ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి, దాని నియమాలను నిర్ణయించారని, వారి నిర్దేశాల ప్రకారమే విశ్వం నడుస్తోందని, దాని ఫలితమే విశ్వ రచన, మానవ జన్మ జరిగాయి అనీ, మరికొందరు మరొక ప్రతిపాదన చేశారు.
కానీ, దీనికి కూడా వైజ్ఞానిక నిరూపణ కానీ ఆధారం కానీ లేదు. విశ్వం యొక్క పరిణామం అందులోని పదార్థ లక్షణాల లోనే ఉంది. అందు వలననే అది నిత్య పరిణామ శీలం. ఈ పరిణామ గతీ దిశా ఎవరి చేతుల లోనూ లేదు. దానికి ఒక నిర్దిష్ట లక్ష్యం అంటూ ఏదీ లేదు. కనుక దీనిని ఎవరో పుట్టించారు, నడిపిస్తున్నారు, ఎపుడో నాశం చేసేస్తారు అనే ఊహాగానాల అవసరమే లేదు. వాటికి విలువ ఇవ్వనవసరమే లేదు.
3. విశ్వం మారుతూ ఉన్నందు వలన అది మిథ్య అని, అబద్ద మని చెప్పి, మారని దేదో ఉంది అదే నిజం అని కొందరు ప్రతిపాదించి, అదే జ్ఞానమని మరికొందరు సెలవిచ్చారు.
కానీ, వైజ్ఞానికం గా పరిశీలిస్తే, మారనిది అంటూ లేదు. అసలు ఉనికి అంటేనే మార్పు కాగలిగి ఉండటం. మార్పు లేకుండా ఉనికి లేదు. విశ్వం భౌతికం మరియు వాస్తవం. అది మిథ్య కాదు. కనుక వారి ప్రతిపాదన ను వైజ్ఞానికం గా త్రోసి పుచ్చ వలసినదే.
4. మరి కొందరు విశ్వం అనేది అసలు లేదని. కేవలం మనం చూస్తున్నాము కనుక నే అది ఉన్నట్టు గా అనిపిస్తున్నదని, చూడక పోతే దానికి ఉనికే ఉండదని, ఎవరు ఎలా అనుకుంటే అలా ఉంటుంది (యద్భావం తద్భవతి) అని మరో వింత ప్రతి పాదన చేశారు.
అది కూడా వాస్తవ విరుద్ధం గా ఉంది. మన ఆలోచనను బట్టి ప్రకృతి ఉండదు. అది ఎలా ఉందో అనేదే మనం అర్థం చేసుకుంటాము. మనం చల్లగా ఉంది అనుకుని కాలిన ఇనుమును పట్టు కుంటే, అది చల్లగా అయి పోదు, కాలుస్తుంది. మన చేయి కాలాక అది వేడి అవలేదు. అది వేడి ఆయి నందు వలననే మన చేయి కాలింది. అలాగే, విశ్వం ఉన్నది కనుక దానిని మనం చూడ గలుగుతున్నాము కనుకనే, అది మనకు అనుభవం లోనికి వస్తున్నది అన్నది వాస్తవం. అంతే కాని, మన అనుభవం లోకి వచ్చింది కనుక అది ఉనికి లోకి వచ్చింది అంటే, అది మూర్ఖత్వం.
ఇలా, మనం వైజ్ఞానిక పద్ధతి లో తెలిసిన విషయాల ద్వారా మన మున్ముత్తాతవ్వలు చెప్పిన విషయాలలోని అపోహలను తొలగించుకుని వాస్తవాలు తెలుసుకుంటేనే మనం పురోగతి చెంద గలుగుతాము.
Comments
Post a Comment